ఇంటర్నెట్ డెస్క్: హీరో విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ అంటూ పలకరించేందుకు సిద్ధమయ్యారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జులై 31న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈసందర్భంగా చెన్నైలో ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్‌ను ఏర్పాటుచేశారు. అందులో విజయ్ మాట్లాడుతూ హీరో సూర్యకు (Suriya) ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. టీజర్‌కు వాయిస్ ఓవర్ ఇస్తారా అని అడగ్గానే అంగీకరించారని తెలిపారు.
‘‘కింగ్డమ్’ (Kingdom) కథ అనుకోగానే దీన్ని తమిళంలో కూడా కచ్చితంగా విడుదల చేయాలని భావించాం. ఈ సినిమా విడుదలకు ముందు ముఖ్యంగా ఇద్దరికి కృతజ్ఞతలు చెప్పాలి. వారిలో ఒకరు హీరో సూర్య. నాకు మొహమాటం ఎక్కువ. ఎవరిని సాయం అడగలేను. ‘కింగ్డమ్’ తమిళ టీజర్‌కు సూర్య వాయిస్ ఇస్తే బాగుంటుందని దర్శకుడు తెలిపారు. నేను ఈ మాట అడగ్గానే సూర్య ఓకే చెప్పారు. ఆయన పవర్‌ఫుల్ వాయిస్ టీజర్‌ను మరింత పవర్‌ఫుల్‌గా చేసింది. థాంక్యూ సూర్య అన్న’’
‘‘ఇక రెండో వ్యక్తి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్.. అతడు ఈ సినిమాకు ప్రాణం పెట్టాడు. ఇప్పటికీ దీని పనుల్లోనే బిజీగా ఉన్నాడు. అతడిని కిడ్నాప్ చేసి నాతోపాటే ఉంచుకోవాలని ఉంది. ఈ సినిమా విషయంలో నేను (Vijay Deverakonda) చెప్పిన అప్‌డేట్స్ కంటే అనిరుధ్ చెప్పినవే వైరల్ అయ్యాయి. ఇటీవల జరిగిన ఈవెంట్‌లో కూడా ఈ చిత్రం మా అందరికీ మైల్‌స్టోన్ అవుతుందని అనిరుధ్ చెప్పాడు. ఆ మాటనే ఎంతోమంది షేర్ చేశారు. మరో రెండు రోజుల్లో ‘కింగ్డమ్’ మీ ముందుకురానుంది. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’’ అని తెలిపారు.
ఇందులో కోలీవుడ్ నటీనటులున్నారా?
విజయ్ దేవరకొండ: ఇందులో ఎంతోమంది తమిళ్ నటీనటులు కూడా ఉన్నారు. సాంకేతిక బృందంలోనూ కోలీవుడ్ వాళ్లు వర్క్ చేశారు.
‘కింగ్డమ్’ను ఎంపిక చేసుకోవడానికి ప్రత్యేక కారణం ఏమైనా ఉందా?
విజయ్ దేవరకొండ: ప్రేక్షకులు కోరుకునేవిధంగా ఉండాలని అనుకుంటాను. ఏ పాత్ర ఎంపిక చేసుకున్నా వందశాతం కష్టపడతాను. ఇందులో ఓ సన్నివేశం కోసం గుండు చేయించుకుని కనిపించినప్పుడు అందరూ బెదిరిపోయారు. నేను చూడడానికి ఎలా ఉన్నా.. పాత్రకు న్యాయం చేస్తే చాలని చెప్పాను.
పోలీస్ పాత్రలో నటించడం కష్టంగా ఉందా?
విజయ్ దేవరకొండ: కానిస్టేబుల్‌గా కొంత సమయం కనిపిస్తాను. ఆ తర్వాత మీరు చూస్తున్న పోస్టర్‌లో ఉన్నట్లు ఉంటాను. భవిష్యత్తులో సినిమా మొత్తం పోలీస్‌గా కనిపించే పాత్ర చేయాలనుంది.