
ఇంటర్నెట్ డెస్క్: అండర్సన్-తెందూల్కర్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లాండ్, భారత్ (ENG vs IND) మధ్య జులై 10 నుంచి మూడో టెస్టు ప్రారంభంకానుంది. లండన్‌లోని ప్రతిష్ఠాత్మక లార్డ్స్ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక. రెండో టెస్టులో భారత బ్యాటర్లు పరుగుల వరద పారించడంతో మూడో మ్యాచ్ కోసం ఇంగ్లాండ్ బలమైన జట్టుతో బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్ కోసం తుది జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్.. ఫాస్ట్‌బౌలర్ జోఫ్రా ఆర్చర్ (Jofra Archer)కు అవకాశం కల్పించింది. జోష్ టంగ్ స్థానంలో ఆర్చర్‌ను తీసుకున్నారు. ఈ ఒక్క మార్పు మినహా ఎడ్జ్‌బాస్టన్‌లో టెస్టులో ఆడిన మిగతా జట్టును యథావిథిగా కొనసాగించారు.
30 ఏళ్ల ఆర్చర్ లార్డ్స్ మైదానంలోనే టెస్టు కెరీర్ (2019)ను ఆరంభించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన ఆ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి ఐదు వికెట్లు పడగొట్టాడు. తర్వాత అక్కడ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఆర్చర్ చివరగా ఫిబ్రవరి, 2021లో భారత్‌పైనే టెస్టు మ్యాచ్ ఆడాడు. అనంతరం ఫిట్‌నెస్ సమస్యలు, గాయాలతో రెడ్‌బాల్ క్రికెట్‌కు దూరమయ్యాడు. ఇటీవల కౌంటీ క్రికెట్‌లో ఆడి ఫిట్‌నెస్ నిరూపించుకోవడంతో టెస్టు జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇక, సిరీస్ విషయానికొస్తే.. తొలి టెస్టులో ఇంగ్లాండ్ గెలవగా.. రెండో టెస్టులో భారత్ విజయం సాధించి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. లార్డ్స్ టెస్టులో గెలుపొంది ఆధిక్యంలోకి వెళ్లాలని ఇరుజట్లు తమ వ్యూహాలకు పదునుపెట్టాయి. మూడో టెస్టులో జస్‌ప్రీత్ బుమ్రా ఆడుతుండటంతో ఇంగ్లాండ్ బ్యాటర్లకు తిప్పలు తప్పవు. ఆర్చర్ విషయంలో టీమ్ఇండియా బ్యాటర్లూ అప్రమత్తంగా ఉండాల్సిందే.
లార్డ్స్ టెస్టు కోసం టీమ్ఇండియా తుదిజట్టులో నలుగురు పేసర్లు ఉండాలని క్రికెట్ విశ్లేషకుల సూచన. దీనిపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కింది పోల్‌లో తెలియజేయండి.






